౨౪
౧ సౌలు ఫిలిష్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది. ౨ అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు.
౩ దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు. ౪ దావీదు అనుచరులు “నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది” అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.
౫ సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని, ౬  “ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను” అని తన వారితో చెప్పాడు. ౭ ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు.
౮ అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి “నా యజమానీ, రాజా” అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి ౯ సౌలుతో ఇలా అన్నాడు “దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? ౧౦ ఆలోచించు. ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. ‘ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను’అని చెప్పాను. ౧౧ నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు. ౧౨ నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.
౧౩ పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను. ౧౪ ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటివాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా? ౧౫ యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.”
౧౬ దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు, సౌలు “దావీదూ, నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా?” అని బిగ్గరగా ఏడ్చి ౧౭ దావీదుతో ఇలా అన్నాడు. “యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు ౧౮ ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి, నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి. ౧౯ ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.
౨౦ కచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరం అయిందని నాకు తెలుసు. ౨౧ కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంట్లోనుండి నా పేరు కొట్టివేయకుండేలా, యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి.” అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు.
౨౨ తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.