౨౫
౧ అమజ్యా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్లవాడు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యెహోయద్దాను. ౨ అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు గాని పూర్ణహృదయంతో ఆయన్ని అనుసరించలేదు.
౩ రాజ్యం తనకు సుస్థిరం అయ్యాక అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించాడు. ౪ అయితే “తండ్రులు పిల్లల కోసం, పిల్లలు తండ్రులకోసం చావకూడదు, ప్రతి మనిషి తన పాపం కోసం తానే చావాలి” అని మోషేగ్రంథం అయిన ధర్మశాస్త్రంలో రాసి ఉన్న యెహోవా ఆజ్ఞ ప్రకారం అతడు వారి పిల్లలను చంపలేదు.
౫ అమజ్యా యూదావారందరినీ సమకూర్చి యూదా దేశమంతటా బెన్యామీనీయుల దేశమంతటా వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ నియమించాడు. అతడు 20 ఏళ్ళు మొదలు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిని లెక్కిస్తే, ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధానికి వెళ్ళగలిగిన యోధులు మూడు లక్షల మంది అయ్యారు. ౬ అతడు ఇంకా లక్ష మందిని మూడు వేల నాలుగు వందల కిలోల వెండి ఇచ్చి జీతానికి కుదుర్చుకున్నాడు.
౭ దేవుని మనిషి ఒకడు అతని దగ్గరికి వచ్చి “రాజా, ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకు పోవద్దు, యెహోవా ఇశ్రాయేలువారైన ఎఫ్రాయిమీయుల్లో ఎవరికీ తోడుగా ఉండడు. ౮ ఆలా వెళ్లాలని నీకుంటే వెళ్ళు. యుద్ధం బలంగా చేసినా దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను పడగొడతాడు. సహాయం చేయడానికీ పడవేయడానికీ దేవుడు సమర్దుడే గదా” అని చెప్పాడు.
౯ అమజ్యా అతనితో “ఇశ్రాయేలువారి సైన్యానికి నేనిచ్చిన 3,500 కిలోల వెండి సంగతి ఏం చేద్దాం” అని అడిగాడు. దానికతడు “దీనికంటే ఇంకా ఎక్కువ యెహోవా నీకు ఇవ్వగలడు” అని జవాబిచ్చాడు. ౧౦ అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములోనుంచి తన దగ్గరికి వచ్చిన సైన్యాన్ని వేరుపరచి “మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళండి” అని వారికి చెప్పాడు. అందుకు వారికి యూదావారి మీద తీవ్ర కోపం వచ్చింది. వారు మండిపడుతూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయారు.
౧౧ అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన ప్రజలతో బయలుదేరి, ఉప్పు పల్లపు స్థలానికి పోయి శేయీరువారిలో 10,000 మందిని హతమార్చాడు. ౧౨ ప్రాణాలతో ఉన్న మరొక 10,000 మందిని యూదావారు చెరపట్టుకుని, వారిని ఒక కొండ అంచుకు తీసుకుపోయి అక్కడనుంచి వారిని పడవేస్తే వారు ముక్కలైపోయారు.
౧౩ అయితే తనతో యుద్ధానికి రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలు బేత్‌హోరోను వరకూ ఉన్న యూదా పట్టణాల మీద పడి వారిలో 3,000 మందిని చంపి విస్తారమైన దోపిడీ సొమ్ము పట్టుకు పోయారు.
౧౪ అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు ప్రజల దేవుళ్ళను తీసుకువచ్చి తనకు దేవుళ్ళుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాడు. ౧౫ అందువలన యెహోవా కోపం అమజ్యా మీద రగులుకుంది. ఆయన అతని దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు “నీ చేతిలోనుంచి తమ ప్రజలను విడిపించే శక్తి లేని దేవుళ్ళ దగ్గర నీవెందుకు విచారణ చేస్తావు?” అని అమజ్యాతో అన్నాడు.
౧౬ అతడు అమజ్యాతో మాటలాడుతుంటే, రాజు అతనితో “మేము నిన్ను రాజుకు సలహాదారునిగా చేశామా? ఆగు. ప్రాణాల మీదికి ఎందుకు తెచ్చుకుంటావు?” అన్నాడు. ఆ ప్రవక్త ఆగి “దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడు. ఎందుకంటే నీవు నా సలహా పాటించ లేదు” అన్నాడు.
౧౭ అప్పుడు యూదారాజు అమజ్యా తన సలహాదారులతో ఆలోచన చేసి “రండి, మనం యుద్ధంలో ఒకరికొకరం తలపడదాం” అని యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోయాషుకు కబురు పంపాడు. ౧౮ కాగా ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదారాజు అమజ్యాకు ఇలా తిరుగు సందేశం పంపాడు. “ ‘నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యి’ అని లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టు లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి సందేశం పంపితే లెబానోనులో తిరిగే ఒక అడవి జంతువు ఆ ముళ్ళచెట్టును తొక్కివేసింది. ౧౯ ‘నేను ఎదోమీయులను ఓడించాను’ అని నీవనుకుంటున్నావు. నీ హృదయం నీవు గర్వించి ప్రగల్భాలాడేలా చేస్తున్నది. ఇంటి దగ్గరే ఉండు. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకోవడం ఎందుకు? నువ్వూ నీతో పాటు యూదావారూ ఓడిపోవడం ఎందుకు?”
౨౦ ప్రజలు ఎదోమీయుల దేవుళ్ళ దగ్గర విచారణ చేస్తున్నారు కాబట్టి వారి శత్రువుల చేతికి వారు చిక్కేలా దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ సందేశాన్ని అంగీకరించ లేదు. ౨౧ ఇశ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరాడు. యూదాకు చెందిన బేత్షెమెషులో అతడూ యూదా రాజు అమజ్యా ఒకరినొకరు ఎదుర్కొన్నారు.
౨౨ యూదావారు ఇశ్రాయేలువారి ముందు నిలవలేక ఓడిపోయారు. ప్రతివాడూ తన గుడారానికి పారిపోయాడు. ౨౩ అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోయాషు యెహోయాహాజుకు పుట్టిన యోవాషు కొడుకూ, యూదారాజూ అయిన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకుని యెరూషలేముకు తీసుకు వచ్చి, యెరూషలేము ప్రాకారాన్ని ఎఫ్రాయిము గుమ్మం మొదలు మూల గుమ్మం వరకూ 400 మూరల పొడుగున పడగొట్టాడు. ౨౪ అతడు దేవుని మందిరంలో ఓబేదెదోము దగ్గర ఉన్న మొత్తం వెండి, బంగారం పాత్రలన్నీ రాజభవనంలో ఉన్న సొమ్మంతా తీసుకు షోమ్రోనుకు తిరిగి వెళ్లి పోయాడు.
౨౫ ఇశ్రాయేలు రాజూ యెహోయాహాజు కొడుకూ అయిన యెహోయాషు చనిపోయిన తరువాత యూదా రాజూ, యోవాషు కొడుకూ అయిన అమజ్యా 15 ఏళ్ళు బతికాడు. ౨౬ అమజ్యా గురించిన ఇతర విషయాలు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసివున్నాయి. ౨౭ అమజ్యా యెహోవాను అనుసరించడం మానివేసిన తరువాత ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేశారు. అతడు లాకీషుకు పారిపోయాడు. ౨౮ అయితే వారు అతని వెనుక లాకీషుకు మనుష్యులను పంపి అతణ్ణి అక్కడ చంపి, గుర్రాల మీద అతని శవాన్ని ఎక్కించి తీసుకువచ్చి యూదా పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర పాతిపెట్టారు.