James
యాకోబు రాసిన పత్రిక
విశ్వాసానికి పరీక్షలు (పరీక్షల ఉద్దేశం)
౧ దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి రాస్తున్నది. ౨ నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని ౩ రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. ౪ ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.
౫ మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. ౬ కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. ౭ అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. ౮ అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. నిలకడ లేనివాడు.
౯ దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. ౧౦ ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి.
౧౧ సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. ౧౨ పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.
చెడు చేయాలనే ప్రేరణ దేవుని నుంచి కలిగేది కాదు
౧౩ చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.
౧౪ ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. ౧౫ చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. ౧౬ నా ప్రియ సోదరులారా, మోసపోకండి. ౧౭ ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.
౧౮ దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనల్ని కలగజేశాడు. ౧౯ నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలియాలి. ౨౦ ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు.
౨౧ కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.
విధేయతకు పరీక్ష
౨౨ వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ౨౩ ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. ౨౪ అతడు తన మొహం పరిశీలనగా చూసుకొని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. ౨౫ కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.
నిజమైన భక్తికి పరీక్ష
౨౬ తాను భక్తిపరుణ్ణి అని చెప్పుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం. ౨౭ తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.