౧౧
౧ హాసోరు రాజు యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజు యోబాబుకూ, షిమ్రోను రాజుకూ, అక్షాపు రాజుకూ, ౨ ఉత్తరం వైపున ఉన్న మన్యదేశంలో కిన్నెరెతు దక్షిణం వైపున ఉన్న అరాబాలో షెఫేలాలో పడమట ఉన్న దోరు కొండ ప్రాంతంలో ఉన్న రాజులకూ, ౩ తూర్పు పడమటి దిక్కుల్లో ఉన్న కనానీయులకూ, అమోరీయులకూ, హిత్తీయులకూ, పెరిజ్జీయులకూ, కొండ ప్రాంతంలో ఉన్న యెబూసీయులకూ, మిస్పా దేశంలోని హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకూ కబురు పంపించాడు.
౪ వారంతా సముద్రతీరంలోని ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైనికులనందరినీ సమకూర్చుకుని, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరారు. ౫ ఆ రాజులంతా కలిసి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల దగ్గర దిగారు.
౬ అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు. రేపు ఈ సమయానికి నేను వారినందరినీ ఇశ్రాయేలు ప్రజల చేతిలో చచ్చినవారుగా అప్పగిస్తాను. నీవు వారి గుర్రాల గుదికాలి నరాలు తెగగోసి వారి రథాలను అగ్నితో కాల్చివేస్తావు” అని యెహోషువతో చెప్పాడు.
౭ కాబట్టి యెహోషువ, అతనితో ఉన్న యోధులంతా హఠాత్తుగా మేరోము నీళ్ల దగ్గరికి వచ్చి వారిపై దాడి చేశారు. ౮ యెహోవా, ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. ఇశ్రాయేలీయులు వారిని హతం చేసి మహా సీదోను వరకూ మిశ్రేపొత్మాయిము వరకూ తూర్పు వైపు మిస్పా లోయ వరకూ వారిని తరిమి ఒక్కడు కూడా మిగలకుండా చంపారు.
౯ యెహోవా యెహోషువతో చెప్పినట్టు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రాల గుదికాలి నరాలుని తెగగొట్టి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. ౧౦ ఆ సమయంలోనే యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తితో హతం చేశాడు. గతంలో హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ అధిపతి. ౧౧ ఇశ్రాయేలు ప్రజలు దాన్లో ఉన్న ప్రతి ఒక్కరినీ కత్తితో హతం చేశారు. ఎవ్వరూ తప్పించుకోకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేశాడు. తరువాత అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాడు.
౧౨ యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణాలను వశం చేసుకుని వాటిని నాశనం చేశాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టు అతడు వారిని నిర్మూలం చేశాడు. ౧౩ అయితే యెహోషువ హాసోరుని కాల్చినట్టు మట్టి దిబ్బల మీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు కాల్చలేదు. ౧౪ ఆ పట్టణాలకు సంబంధించిన కొల్లసొమ్మునూ పశువులనూ ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. మనుషుల్లో ఒక్కర్నీ విడిచిపెట్టకుండా అందర్నీ నాశనం చేసే వరకూ కత్తితో హతం చేశారు.
౧౫ యెహోవా తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ ఆప్రకారమే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి కూడా అతడు చేయకుండా విడిచిపెట్టలేదు.
౧౬ యెహోషువ శేయీరుకు పోయే హాలాకు కొండ నుండి ౧౭ లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు వరకూ ఆ దేశమంతటినీ అంటే కొండ ప్రాంతాన్నీ, దక్షిణ దేశమంతటినీ, గోషేను దేశమంతటినీ, షెఫేలా ప్రదేశాన్నీ, మైదానాన్నీ, ఇశ్రాయేలు కొండలనూ వాటి లోయలనూ వాటి రాజులందర్నీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు.
౧౮ చాలా రోజులు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేసాడు. గిబియోను ప్రజలూ హివ్వీయులూ కాకుండా ౧౯ ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసిన పట్టణం ఇంకేదీ లేదు. ఆ పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలో తమ వశం చేసుకున్నారు. ౨౦  “వారిని నిర్మూలం చేయండి” అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు ప్రజలు కనికరం లేకుండా వారిని నాశనం చేయడాని వీలుగా, వారు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు.
౨౧ ఆ సమయంలో యెహోషువ వచ్చి పర్వత ప్రాంత దేశంలో అంటే హెబ్రోనులో, దెబీరులో, అనాబులో, యూదా పర్వత ప్రాంతాలన్నిటిలో, ఇశ్రాయేలు ప్రజల పర్వత ప్రాంతాలన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాడు. యెహోషువ వారిని వారి పట్టణాలనూ నిర్మూలం చేశాడు. ౨౨ ఇశ్రాయేలు ప్రజల దేశంలో అనాకీయుల్లో ఎవడూ మిగల్లేదు. గాజా, గాతు, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలారు.
౨౩ యెహోవా మోషేతో చెప్పినట్టు, యెహోషువ దేశాన్నంతటినీ వశం చేసుకున్నాడు. యెహోషువ వారి గోత్రాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యంగా దాన్ని అప్పగించాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా శ్రాంతిగా ఉంది.