౧౬
తిమోతి పరిచయం
౧ పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత. తండ్రి గ్రీసు దేశస్థుడు. ౨ తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది. ౩ అతడు తనతో కూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు.
౪ వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు. ౫ కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
ఆత్మ మార్గనిర్దేశం. మాసిదోనియ దర్శనం
౬ ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ ౭ యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
౮ అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. ౯ అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చేయి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. ౧౦ అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.
౧౧ మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము.
ఫిలిప్పిలో పరిచర్య. ఐరోపా ఖండంలో మొదటి విశ్వాసి లూదియ మార్పు
౧౨ మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం. ౧౩ విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని అనుకున్నాము. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం.
౧౪ లూదియ అనే ఒక భక్తురాలు మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు వస్త్రాలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు. ౧౫ ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.
దయ్యాన్ని వదిలించడం. పౌలు సీలలకు దెబ్బలు
౧౬ మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.
౧౭ ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. ౧౮ ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.
౧౯ ఆమె యజమానులు తమ రాబడి పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు. ౨౦ న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి ౨౧ రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు” అని చెప్పారు.
౨౨ అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. ౨౩ వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. ౨౪ అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.
ఖైదు అధికారి మార్పు
౨౫ మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. ౨౬ అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
౨౭ అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకొని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. ౨౮ అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు.
౨౯ చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, ౩౦ వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. ౩౧ అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి ౩౨ అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. ౩౩ రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.
౩౪ అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
౩౫ తెల్లవారగానే, వారిని విడిచిపెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటుల్ని పంపారు. ౩౬ చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియజేసి, “మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి” అని చెప్పాడు.
౩౭ అయితే పౌలు, “వారు న్యాయం విచారించకుండానే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకు రావాలి” అని చెప్పాడు.
౩౮ భటులు ఈ మాటలు న్యాయాధికారులకు తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి ౩౯ వారిని బతిమాలుకుని చెరసాల బయటికి తీసుకుపోయి, పట్టణం విడిచి వెళ్ళండని వారిని ప్రాధేయపడ్డారు. ౪౦ పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళారు. వారు సోదరులను చూసి, ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు.