౧౨
౧  “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు. ౨ సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.
౩ బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు. ౪ దానియేలూ, నీవు ఈ మాటలను దాచి అంత్యకాలం వరకూ ఈ గ్రంథానికి సీలు వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది.”
౫ దానియేలు అనే నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడు, ఇవతలి ఒడ్డున ఒకడు నిలబడ్డారు. ౬ ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసుకుని ఏటి ఎగువ భాగాన ఉన్న వ్యక్తిని చూసి ఈ ఆశ్చర్యకరమైనవి ఎప్పుడు పూర్తి అవుతాయని అడిగాడు. ౭ నారబట్టలు వేసుకుని ఏటి ఎగువన ఉన్న మనిషి మాట నేను విన్నాను. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకు ఎత్తి నిత్యజీవి అయిన ఆయన నామంలో ఒట్టు పెట్టుకుని “ఒక కాలం కాలాలు అర్థకాలం పరిశుద్ధ జనం బలాన్ని కొట్టివేయడం అయిపోయాక వ్యవహారాలన్నీ సమాప్తమై పోతాయి” అన్నాడు.
౮ నేను విన్నాను గాని గ్రహింపలేకపోయాను. “స్వామీ, వీటికి అంతమేమిటి?” అని అడిగాను. ౯ అతడు “ఈ సంగతులు అంత్యకాలం వరకూ అగోచరంగా ఉండేలా సీలు చేసి ఉన్నాయి గనక, దానియేలూ, నీవు ఊరుకో” అని చెప్పాడు. ౧౦ చాలా మంది తమను శుద్ధిపరచుకుని ప్రకాశవంతులు, నిర్మలులు అవుతారు. దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారు గనక అలాటివాడు ఎవడూ ఈ సంగతులు గ్రహించలేడు. బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు.
౧౧ అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలు నాశనం కలగజేసే హేయమైనదాన్ని నిలబెట్టే వరకూ 1,290 దినాలౌతాయి. ౧౨ 1,335 దినాలు గడిచే వరకూ ఎదురు చూసేవాడు ధన్యుడు. ౧౩ నీవు కడవరకూ నిలకడగా ఉంటే విశ్రాంతి నొంది కాలం అంతమయ్యేటప్పుడు నీకు నియమించిన పదవి పొందుతావు.