౨౬
౧  “నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్తవర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి. ౨ ప్రతి తెర పొడవు 28 మూరలు. వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత.
౩ ఐదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి. మిగిలిన ఐదు తెరలను కూడా ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి. ౪ తెరల కూర్పు చివర మొదటి తెర అంచుకి నీలినూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలానే చేయాలి. ౫ ఒక తెరలో ఏభై ఉచ్చులు చేసి, అవి ఒకదానికొకటి తగులుకునేలా ఆ రెండవ కూర్పులోని తెర అంచులో ఏభై ఉచ్చులు చేయాలి. ౬ ఏభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది అంతా ఒకటే మందిరంగా రూపొందుతుంది.
౭ మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి. ౮ ప్రతి తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు, అలా పదకొండు తెరల కొలత ఒక్కటే. ౯ ఐదు తెరలను ఒకటిగా, ఆరు తెరలను ఒకటిగా ఒక దానికొకటి కూర్చాలి. ఆరవ తెరను గుడారం ఎదుటి భాగాన మడత పెట్టాలి. ౧౦ తెరల కూర్పుకు బయటున్న తెర అంచున ఏభై ఉచ్చులను, రెండవ కూర్పులోపల తెర అంచున ఏభై ఉచ్చులను చెయ్యాలి.
౧౧ ఏభై యిత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి. ౧౨ ఆ తెరల్లో మిగిలిన వేలాడే భాగం అంటే మిగిలిన సగం తెర మందిరం వెనక భాగంలో వ్రేలాడుతూ ఉండాలి. ౧౩ గుడారపు తెరల పొడవులో మిగిలినది ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర మందిరం పైకప్పుగా ఈ వైపు, ఆ వైపు వేలాడాలి. ౧౪ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేసి, దాన్ని సీలు జంతువు తోళ్లతో కప్పాలి.
౧౫ మందిరానికి తుమ్మ చెక్కతో నిలువు పలకలు చెయ్యాలి. ౧౬ పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర ఉండాలి. ౧౭ ప్రతి పలకలో ఒకదానిలో ఒకటి కూర్చునే విధంగా రెండు కుసులు ఉండాలి. ఆ విధంగా మందిరం పలకలన్నిటికీ చెక్కాలి. ౧౮ నీవు మందిరానికి పలకలు చేసేటప్పుడు ఇరవై పలకలు కుడి వైపున, అంటే దక్షిణ దిక్కున చెయ్యాలి.
౧౯ ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, అంటే ఆ ఇరవై పలకల కింద నలభై వెండి దిమ్మలను చెయ్యాలి. ౨౦ మందిరం రెండవ వైపు అంటే ఉత్తర దిక్కున ౨౧ ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు చొప్పున ఇరవై పలకలకు నలభై వెండి దిమ్మలు ఉండాలి.
౨౨ పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి. ౨౩ ఆ వెనక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చెయ్యాలి. ౨౪ అవి అడుగున దేనికదేగా ఉండాలి గానీ పై భాగంలో మాత్రం ఒకే రింగులో కూర్చుని ఉండాలి. ఆ విధంగా ఆ రెంటికీ ఉండాలి. ౨౫ పలకలు ఎనిమిది. వాటి వెండి దిమ్మలు పదహారు. ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలుండాలి.
౨౬ తుమ్మచెక్కతో అడ్డ కర్రలు చెయ్యాలి. మందిరం ఒక వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు, ౨౭ మందిరం రెండవ వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు, పడమటి వైపున మందిరం పలకలకు ఐదు అడ్డ కర్రలు ఉండాలి. ౨౮ ఆ పలకల మధ్య ఉండే అడ్డ కర్ర ఈ చివరి నుండి ఆ చివరి వరకూ ఉండాలి. ౨౯ ఆ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. వాటి అడ్డ కర్రలుండే వాటి రింగులను బంగారంతో చేసి అడ్డ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగించాలి. ౩౦ కొండ మీద నీకు చూపించిన దాని నమూనా ప్రకారం మందిరాన్ని నిలబెట్టాలి.
౩౧ నీవు నీల ధూమ్ర రక్త వర్ణాల సన్న నారతో నేసిన ఒక అడ్డ తెరను చెయ్యాలి. అది కళాకారుని నైపుణ్యంతో కెరూబు ఆధార నమూనాగా చెయ్యాలి. ౩౨ తుమ్మచెక్కతో చేసి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభాలపై దాన్ని వెయ్యాలి. దాని కొక్కేలు బంగారువి. వాటి దిమ్మలు వెండివి. ౩౩ ఆ అడ్డతెరను ఆ కొక్కేల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెర లోపలికి తేవాలి. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
౩౪ అతి పరిశుద్ధ స్థలం లో సాక్ష్యపు మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి. ౩౫ అడ్డతెర బయట బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపున ఉన్న మందిరం ఉత్తర దిక్కున దీప వృక్షాన్ని ఉంచాలి. ౩౬ నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి. ౩౭ ఆ తెరకు ఐదు స్తంభాలను తుమ్మ చెక్కతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. వాటి కొక్కేలు బంగారువి. వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోత పోయాలి.”