౧౫
౧ కొన్ని రోజులైన తరువాత గోదుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. ‘నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను’ అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు. ౨ ఆమె తండ్రి “నువ్వు ఆమెను నిజంగా ద్వేషిస్తున్నావని అనుకున్నాను. అందుకే నీ స్నేహితునికి ఆమెను ఇచ్చాను. ఆమె చెల్లి ఆమె కంటే అందకత్తె గదా. ఆమెకు బదులుగా ఆమె చెల్లిని తీసుకో” అన్నాడు. ౩ అప్పుడు సంసోను వారితో “ఈ సారి నేను ఫిలిష్తీయులకు కీడు చేసినా నిర్దోషి గానే ఉంటాను” అన్నాడు.
౪ సంసోను అక్కడి నుంచి వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకున్నాడు. రెండేసి నక్కల తోకలను ముడి పెట్టాడు. ఆ తోకల మధ్యలో ఒక్కో కాగడా కట్టి ఉంచాడు. ౫ ఆ కాగడాలను మండించి అవి మండుతుండగా ఆ నక్కలను ఫిలిష్తీయుల గోదుమ పొలాల్లోకి తరిమాడు. అవి ధాన్యం కుప్పలనూ, పైరునీ, ద్రాక్ష, ఒలీవ తోటలనూ తగులబెట్టాయి. ౬ ఫిలిష్తీయులు “ఎవడు చేసాడిలా” అన్నారు. “తిమ్నాతు వాడి అల్లుడైన సంసోను చేశాడు. ఎందుకంటే సంసోను భార్యను ఆ తిమ్నాతు వాడు అతని స్నేహితుడికిచ్చాడు” అనే జవాబు వచ్చింది. అప్పుడు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెనూ ఆమె తండ్రినీ సజీవ దహనం చేశారు.
౭ అప్పుడు సంసోను “మీరు ఇలా చేశారు గనక, నేనూ మీ మీద పగ తీర్చుకునే దాకా ఊరుకోను” అని చెప్పాడు. ౮ అతడు వారి తొడలనూ తుంటి ఎముకలనూ విరగగొట్టి ముక్కలు చేసి అనేకమందిని చంపేశాడు. ఆ తరువాత వెళ్లి ఏతాము బండ సందుల్లోని ఒక గుహలో నివసించాడు.
౯ అప్పుడు ఫిలిష్తీయులు యూదా దేశంపై యుద్ధం చేయడానికై లేహి అనే ప్రాంతంలో సైన్యాన్ని సమకూర్చారు. ౧౦ యూదాప్రజలు వారిని “మీరెందుకు మాపై యుద్ధం చేస్తున్నారు?” అని అడిగారు. దానికి ఫిలిష్తీయులు “సంసోనును పట్టుకోడానికే యుద్ధం చేస్తున్నాం. అతడు మాకు చేసినదానికి మేమూ బదులు తీర్చుకోవాలి” అన్నారు.
౧౧ అప్పుడు యూదా వారిలో మూడువేలమంది ఏతాము బండ సందుల్లోని గుహ దగ్గరికి వెళ్లి సంసోనుతో ఇలా అన్నారు “ఫిలిష్తీయులు మన పాలకులని తెలీదా? మా మీదికి ఏం తెచ్చిపెట్టావో చూడు” అన్నారు. దానికి సంసోను “వాళ్ళు నాకేం చేసారో నేనూ వాళ్ళకూ అదే చేసాను” అన్నాడు. ౧౨ దానికి వారంతా “మేము నిన్ను కట్టి పడేసి ఫిలిష్తీయులకు అప్పగించడానికి వచ్చాం” అన్నారు. అందుకు సంసోను “మీరు మాత్రం నన్ను చంపం అని ప్రమాణం చేయండి” అన్నాడు. ౧౩ అందుకు వారు “మేము నిన్ను చంపం. కేవలం తాళ్ళతో బంధించి వాళ్లకి అప్పగిస్తాం” అన్నారు. ఇలా చెప్పి వారు అతణ్ణి కొత్తగా పేనిన తాళ్ళతో బలంగా బంధించి తీసుకుని వచ్చారు.
౧౪ అతడు లేహీకి వచ్చేసరికి ఫిలిష్తీయులు అతణ్ణి ఎదుర్కోడానికి వెళ్లి పెద్దగా కేకలు వేశారు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని బలంగా ఆవహించాడు. అతని చేతులను బంధించిన తాళ్ళు కాలిపోయిన జనపనారలాగా అయ్యాయి. వేసిన సంకెళ్ళు ఊడి పడ్డాయి. ౧౫ అతనికి ఒక పచ్చి గాడిద దవడ దొరికింది. దాన్ని పట్టుకుని దానితో వెయ్యి మందిని కొట్టి చంపాడు.
౧౬ అప్పుడు సంసోను ఇలా అన్నాడు,
“నేను గాడిద దవడ ఎముకతో కుప్పలు కుప్పలుగా,
గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను చంపాను.”
౧౭ అతడు ఇలా చెప్పిన తరువాత ఆ దవడ ఎముకను పారవేసి ఆ స్థలానికి “రామత్లేహి” అనే పేరు పెట్టాడు. ౧౮ అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసి యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. “నీ సేవకునికి గొప్ప విజయం అనుగ్రహించావు. ఇప్పుడు నేను దాహంతో మరణిస్తే ఈ సున్నతి సంస్కారం లేని మనుషుల చేతిలో పడతాను” అంటూ వేడుకున్నాడు.
౧౯ అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి “ఏన్ హక్కోరే” అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది. ౨౦ సంసోను ఫిలిష్తీయుల రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు.