౧౫
౧ అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.”
౨  “మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.
౩ చంపడానికి కత్తినీ, చీల్చడానికి కుక్కలనూ, తినివేయడానికీ నాశనం చేయడానికీ ఆకాశ పక్షులనూ, భూమి మీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఈ నాలుగు రకాల బాధలు వారికి వస్తాయి.” ఇది యెహోవా వాక్కు.
౪ యూదా రాజు హిజ్కియా కొడుకు మనష్షే యెరూషలేములో చేసిన పనులను బట్టి భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ భీతి కలిగేలా చేస్తాను.
౫ యెరూషలేమా, నిన్ను ఎవరు కనికరిస్తారు? నీ గురించి ఎవరు ఏడుస్తారు? నీ బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? ఇది యెహోవా వాక్కు.
౬ నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.
౭ దేశం గుమ్మాల్లో నేను వారిని చేటతో తూర్పారపడతాను. నా ప్రజలు తమ పద్ధతులను విడిచి నా దగ్గరికి రావడం లేదు కాబట్టి వాళ్ళను నాశనం చేస్తాను. వారికి వియోగం కలిగిస్తాను.
౮ వారి వితంతువుల సంఖ్య సముద్రతీరాన ఇసుక కంటే ఎక్కువయ్యేలా చేస్తాను. నేను మధ్యాహ్నం సమయంలో యువకుల తల్లుల మీదికి నాశనం చేసేవాణ్ణి పంపిస్తాను. వారి మీదికి భయం, దిగ్భ్రాంతి ఆకస్మాత్తుగా రప్పిస్తాను.
౯ ఏడుగురిని కనిన స్త్రీ నీరసించి ప్రాణం విడుస్తుంది. పగటి సమయం ఇంకా ఉండగానే ఆమె పొద్దు ముగుస్తుంది. ఆమె సిగ్గుతో అవమానం పాలవుతుంది. మిగిలిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
౧౦ అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు.
౧౧ అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “మంచి కోసం నేను నిన్ను తప్పించనా? తప్పకుండా విపత్తులో బాధలో నీ శత్రువులు నీ సాయాన్ని అర్థించేలా చేస్తాను.
౧౨ ఇనుమును, మరి ముఖ్యంగా ఉత్తర దేశం నుంచి వచ్చిన కంచు కలిసిన ఇనుమును ఎవడైనా విరగ గొట్టగలడా?
౧౩ మీ ప్రాంతాలన్నిటిలో మీరు చేసే పాపాలన్నిటికీ మీ సంపదనూ మీ విలువైన వస్తువులనూ నేను దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.
౧౪ నువ్వెరుగని దేశంలో మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను. నా కోపం మంటల్లాగా రగులుకుంది. అది మిమ్మల్ని దహిస్తుంది.
౧౫ యెహోవా, నా బాధ నీకే తెలుసు. నన్ను గుర్తు చేసుకుని సాయం చెయ్యి. నన్ను బాధించే వారి మీద నా కోసం ప్రతీకారం చెయ్యి. నువ్వు ఓర్పు వహించి నన్ను తీసుకుపోవద్దు. నీ కోసమే నేను నింద భరిస్తున్నానని గుర్తు చేసుకో.
౧౬ సేనల ప్రభువైన యెహోవా, నేను నీ పేరు పెట్టుకున్నాను. నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని తిన్నాను. నీ మాటలు నాకెంతో సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.
౧౭ వేడుక చేసుకునే వాళ్ళ గుంపులో నేను కూర్చుని సంతోషించలేదు. నీ బలమైన చెయ్యి నా మీద ఉంది. కడుపుమంటతో నువ్వు నన్ను నింపావు. కాబట్టి, నేను ఒంటరిగా కూర్చున్నాను.
౧౮ నా బాధకు అంతం లేదెందుకు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నువ్వు నాకు మోసజలం లాగా, ఇంకిపోయే ఊటలాగా ఉంటావా?”
౧౯ అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. “యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు.
౨౦ నేను నిన్ను ఈ ప్రజలకు అభేధ్యమైన కంచుకోటగా చేస్తాను. వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు గాని నిన్ను గెలవలేరు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది యెహోవా వాక్కు.
౨౧ నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి విడిపిస్తాను. నిరంకుశుల బారినుంచి నిన్ను విమోచిస్తాను.”