౨౬
౧ యోషీయా కొడుకు యూదా రాజు యెహోయాకీము పరిపాలన మొదట్లో యెహోవా దగ్గర నుంచి సందేశం ఇలా వచ్చింది,
౨  “యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు యెహోవా మందిర ఆవరణంలో నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యూదా పౌరులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాట కూడా విడిచిపెట్టవద్దు. ౩ ఒకవేళ వాళ్ళు విని తమ దుర్మార్గాన్ని విడిచిపెడితే వాళ్ల మీదికి రప్పిస్తానని చెప్పిన విపత్తును తప్పిస్తాను.”
౪ నువ్వు వారితో ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమిటంటే, ౫ మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, నేను ప్రతిసారీ పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే ౬ నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.”
౭ యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరంలో పలుకుతూ ఉంటే యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా విన్నారు. ౮ అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించిన తరువాత యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా అతణ్ణి పట్టుకుని “నువ్వు తప్పకుండా చావాలి. ౯ ఈ మందిరం షిలోహులాగా అవుతుందనీ ఈ పట్టణంలో ఎవరూ నివసించరనీ, పట్టణం పాడైపోతుందనీ యెహోవా పేరున నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు?” అన్నారు. ప్రజలంతా యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు.
౧౦ యూదా అధికారులు ఈ మాటలు విని రాజ భవనంలో నుంచి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిరపు కొత్త ద్వారం ప్రవేశంలో కూర్చున్నారు. ౧౧ యాజకులతో, ప్రవక్తలతో, అధిపతులతో, ప్రజలందరితో వాళ్ళు ఇలా అన్నారు. “మీరు చెవులారా విన్నట్టుగా ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు, కాబట్టి ఇతడు చావడం సమంజసమే.” ౧౨ అప్పుడు యిర్మీయా అధికారులందరితో ప్రజలందరితో ఇలా చెప్పాడు “ ‘ఈ మందిరానికీ ఈ పట్టణానికీ వ్యతిరేకంగా మీరు విన్న మాటలన్నీ ప్రకటించు’ అని యెహోవా నన్ను పంపాడు.
౧౩ కాబట్టి మీరు ఇప్పుడైనా మీ మార్గాలనూ మీ ప్రవర్తననూ చక్కపరచుకుని మీ యెహోవా దేవుని మాట వినండి. యెహోవా మీమీదికి తేవాలనుకున్న ఆపద రాకుండా చేస్తాడు. ౧౪ ఇదిగో నేను మీ చేతుల్లో ఉన్నాను. మీ దృష్టికేది మంచిదో ఏది సరైనదో అదే నాకు చేయండి. ౧౫ అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.”
౧౬ అప్పుడు అధిపతులు, ప్రజలంతా యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు. “ఈ వ్యక్తి మన యెహోవా దేవుని పేరున మనతో మాట్లాడాడు కాబట్టి ఇతడు చావడం సరి కాదు.”
౧౭ దేశంలోని పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ చేరిన ప్రజలతో,
౧౮  “యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది. ౧౯ యూదా రాజు హిజ్కియా గానీ యూదా ప్రజలు గానీ అతణ్ణి చంపారా? రాజు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనను వేడుకుంటే వాళ్లకు చేస్తానన్న విపత్తు చేయలేదు కదా! అయితే మన మీదికి మనమే గొప్ప కీడు తెచ్చుకుంటున్నాము” అని చెప్పారు.
౨౦ కిర్యత్యారీము వాసి షెమయా కొడుకు ఊరియా అనే ఒకడు యెహోవా పేరున ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యిర్మీయా చెప్పిన మాటల్లాగే ఈ పట్టణానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించాడు. ౨౧ యెహోయాకీం రాజు, అతని శూరులంతా అధికారులంతా అతని మాటలు విన్నప్పుడు, రాజు అతణ్ణి చంపాలని చూశాడు. ఊరియా అది తెలుసుకుని భయపడి ఐగుప్తుకు పారిపోయాడు.
౨౨ అయినప్పటికీ యెహోయాకీం రాజు, అక్బోరు కొడుకు ఎల్నాతానునూ అతనితో కూడా కొంతమందిని ఐగుప్తుకు పంపాడు. ౨౩ వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు. ౨౪ అయితే షాఫాను కొడుకు అహీకాము యిర్మీయాకు సాయపడ్డాడు. అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.