౧౨
బేతనిలో రాత్రి భోజనం (మత్తయి 26:6-13. మార్కు 14:3-9. లూకా 7:37-38)
౧ పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే. ౨ అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు. ౩ అప్పుడు మరియ, అరకిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది. ౪ ఆయనను అప్పగించ బోతున్నవాడు, ఆయన శిష్యుల్లో ఒకడు అయిన ఇస్కరియోతు యూదా, ౫  “ఈ అత్తరు మూడువందల దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు గదా?” అన్నాడు. ౬ అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు. అతడు దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు. ౭ యేసు, “ఈమెను ఇలా చెయ్యనివ్వండి, నా సమాధి రోజు కోసం ఈమె దీన్ని సిద్ధపరచింది. ౮ పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు, కాని నేను ఎప్పుడూ మీతో ఉండను కదా” అన్నాడు.
౯ అప్పుడు పెద్ద యూదుల సమూహం యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకుని, యేసు కోసమే కాక, యేసు చావు నుంచి తిరిగి లేపిన లాజరును కూడా చూడాలని అక్కడికి వచ్చారు. ౧౦-౧౧ లాజరును బట్టి చాలా మంది యూదులు వెళ్ళి యేసు మీద నమ్మకం ఉంచారు. కాబట్టి ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు.
జయ ప్రవేశం (మత్తయి 21:4-9. మార్కు 11:7-10. లూకా 19:35-38)
౧౨ ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు, ౧౩ వారంతా ఖర్జూరపు మట్టలు తీసుకుని ఆయనకు ఎదురుగా వెళ్ళి, “హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగు గాక!” అని కేకలు వేశారు.
౧౪-౧౫  “సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నాడు” అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు. ౧౬ ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వారు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు.
౧౭ ఆయన లాజరును సమాధిలో నుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. ౧౮ ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయనను కలుసుకోడానికి వెళ్ళారు. ౧౯ దీని గురించి పరిసయ్యులు, “చూడండి, మనం ఏమీ చెయ్యలేం. లోకం ఆయన వెంట వెళ్ళింది.” అని తమలో తాము చెప్పుకున్నారు.
యేసును చూడగోరిన గ్రీకులు
౨౦ ఆ పండగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొంతమంది గ్రీకులు ఉన్నారు. ౨౧ వారు, గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అన్నారు. ౨౨ ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. అంద్రెయ ఫిలిప్పుతో కలిసి వెళ్ళి యేసుతో చెప్పారు.
యేసు జవాబు
౨౩ యేసు వారికి జవాబిస్తూ, “మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది. ౨౪ మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది. ౨౫ తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు. ౨౬ నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.
౨౭ ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? ‘తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు’ అని చెప్పనా? కాని, దీని కోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను. ౨౮ తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో” అన్నాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, “నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను.” ౨౯ అప్పుడు, అక్కడ నిలుచుని దాన్ని విన్న జనసమూహం, “ఉరిమింది” అన్నారు. మిగతా వారు, “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు.
౩౦ అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది. ౩౧ ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం. ౩౨ నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను.” ౩౩ ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు. ౩౪ ఆ జనసమూహం ఆయనతో, “క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. ‘మనుష్య కుమారుణ్ణి పైకెత్తడం జరగాలి’ అని నువ్వెలా చెబుతావు? ఈ మనుష్య కుమారుడు ఎవరు?” అన్నారు. ౩౫ అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు. ౩౬ మీకు వెలుగుండగానే, ఆ వెలుగులో నమ్మకముంచి వెలుగు సంబంధులు కండి” అన్నాడు. యేసు ఈ సంగతులు చెప్పి, అక్కడ నుంచి వెళ్ళి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నాడు.
౩౭ యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు.
౩౮ ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?” అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది. ౩౯ ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు,
౪౦  “ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు.
అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి,
హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు.
అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.”
౪౧ యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. ౪౨ అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సమాజ మందిరంలో నుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు. ౪౩ వారు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు.
౪౪ అప్పుడు యేసు పెద్ద స్వరంతో, “నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవాడిలో కూడా నమ్మకం ఉంచుతాడు. ౪౫ నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు.
౪౬ నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకూడదని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను. ౪౭ ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి కాదు.
౪౮ నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది. ౪౯ ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు. ౫౦ ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను” అన్నాడు.