౧ భూమి మీద మనుషులు జీవించే కాలం కాయకష్టం వంటిది కాదా? వాళ్ళ దినాలు కూలి పని చేసే వాడి జీవనం వంటిది కాదా?
౨ బానిసత్వంలో ఉన్నవాడు గూడు కోరుకున్నట్టు, కూలి కోసం పనివాడు ఎదురు చూస్తున్నట్టు నేను ఉన్నాను.
౩ నా ఆశలు నెరవేరక నెలల తరబడి గడపవలసి వచ్చింది. నా కోసం ఆయాసంతో కూడిన రాత్రులు నియమితమై ఉన్నాయి.
౪ నేను పండుకున్నప్పుడల్లా ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు నిద్ర నుండి లేస్తానా అనుకుంటాను. తెల్లవారే వరకూ ఇటూ అటూ దొర్లుతూ మధనపడతాను.
౫ నా శరీరమంతా పురుగులతో, మట్టిపెళ్లలతో కప్పి ఉంది. నా చర్మంపై గడ్డలు గట్టిపడి మళ్ళీ మెత్తగా అయిపోయి బాధ పెడతాయి.
౬ నేత పనివాడి చేతిలోని నాడెలాగా నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఎలాంటి నిరీక్షణ లేకుండా అవి గతించిపోతున్నాయి.
౭ నా ప్రాణం కేవలం ఊపిరి వంటిదని జ్ఞాపకం చేసుకోండి. ఇకపై నా కళ్ళకు ఎలాంటి మంచీ కనబడదు.
౮ నన్ను చూసినవారి కళ్ళకు ఇకపై నేను కనిపించను. నీ కళ్ళు నా కోసం చూసినప్పుడు నేను లేకుండా పోతాను.
౯ మేఘాలు చెదిరిపోయి మాయమైపోయిన విధంగా పాతాళానికి దిగిపోయిన వాడు మళ్లీ పైకి రాడు.
౧౦ ఇక అతడు ఎప్పటికీ తన ఇంటికి తిరిగి రాడు. అతడు నివసించిన స్థలం ఇక అతణ్ణి గుర్తించదు.
౧౧ అందువల్ల నేను నోరు మూసుకుని ఉండను. నా ఆత్మలో వేదన ఉంది. నా వేదన కొద్దీ నేను మాట్లాడతాను. నా మనసులోని వేదనను బట్టి మూలుగుతూ ఉంటాను.
౧౨ నేనేమైనా సముద్రం వంటివాడినా? సముద్ర రాక్షసినా? నన్ను నువ్వెందుకు కాపలా కాస్తున్నావు?
౧౩ నా పడక నాకు ఆధారం అవుతుందని, నా పరుపు నా బాధకు ఉపశమనం కలిగిస్తుందని అనుకున్నాను.
౧౪ అయితే నువ్వు కలలు రప్పించి నన్ను బెదిరిస్తున్నావు. దర్శనాల ద్వారా నేను వణికిపోయేలా చేస్తున్నావు.
౧౫ అందుకని నన్ను ఉరి తీయాలని కోరుతున్నాను. నా అస్థిపంజరాన్ని నేను చూసుకోవడం కన్నా చనిపోవడమే నాకు ఇష్టం.
౧౬ జీవితం అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బతికి ఉండడం నాకు ఇష్టం లేదు. నా జోలికి రావద్దు. నేను బతికే దినాలు ఆవిరిలాగా ఉన్నాయి.
౧౭ మనిషి ఎంతటి వాడు? మనిషిని గొప్పవాడిగా ఎంచడం ఎందుకు? అతని మీద నీ మనస్సు నిలపడం ఎందుకు?
౧౮ ప్రతి ఉదయమూ నువ్వు అతణ్ణి దర్శిస్తావెందుకు? క్షణక్షణమూ అతన్ని పరీక్షిస్తావెందుకు?
౧౯ నన్ను చూస్తూ నువ్వు ఎంతకాలం గడుపుతావు? నేను గుటక వేసే వరకూ నన్ను విడిచిపెట్టవా?
౨౦ మనుషులను కనిపెట్టి చూసేవాడా, ఒకవేళ నేను పాపం చేసినా అది నీకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తాను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీ దృష్టి నాపై ఎందుకు నిలిపావు?
౨౧ నా అతిక్రమాలను నువ్వెందుకు క్షమించవు? నా పాపాలను ఎందుకు తుడిచివేయవు? నేనిప్పుడు మట్టిలో కలసిపోతాను. నన్ను జాగ్రత్తగా వెదకుతావు గానీ నేను ఉండను.