పర్వత ప్రసంగం - ఇతరులను తప్పులెన్నడం
౧  “ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు. ౨ మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది. ౩ నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు? ౪ నీ కంటిలో దుంగను ఉంచుకొని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు? ౫ కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.
౬ పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టవద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.
ప్రార్థనకు ప్రోత్సాహం (లూకా 11:1-13)
౭  “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. ౮ అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. ౯ మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? ౧౦ లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? ౧౧ మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.
రెండు దారులు (కీర్తన 1)
౧౨  “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే. ౧౩ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు. ౧౪ జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.
కపట బోధకుల గురించి హెచ్చరికలు
౧౫  “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ౧౬ వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? ౧౭ అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. ౧౮ మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. ౧౯ మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. ౨౦ ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
విశ్వాసం లేకుండా నోటి మాటల వల్ల లాభం లేదు
౨౧  “ ‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. ౨౨ ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. ౨౩ అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
రెండు రకాల పునాదులు
౨౪  “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. ౨౫ వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. ౨౬ నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. ౨౭ వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”
౨౮ యేసు ఈ మాటలు చెప్పి ముగించినపుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ౨౯ ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారంగల వాడిలాగా వారికి బోధించాడు.