౧ కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి.
౨ నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.
౩ నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి.
౪ ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు “నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు.
౫ జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
౬ జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది.
౭ జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు.
౮ నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. దాన్ని హత్తుకుని ఉంటే అది నీకు పేరు ప్రతిష్టలు తెస్తుంది.
౯ అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది.
౧౦ కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది.
౧౧ జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను.
౧౨ నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు.
౧౩ అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో.
౧౪ భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
౧౫ అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో.
౧౬ ఇతరులకు కీడు చేస్తేనేగాని అలాంటి వాళ్లకి నిద్ర పట్టదు. ఎదుటి వారిని కించపరచకుండా వారు నిద్రపోరు.
౧౭ వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు. బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు.
౧౮ ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది.
౧౯ దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు.
౨౦ కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో.
౨౧ నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో.
౨౨ అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి.
౨౩ అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.
౨౪ నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.
౨౫ నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు.
౨౬ నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి.
౨౭ కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”