౧౨
౧ జ్ఞానం కోరుకున్నవాడు గద్దింపుకు లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.
౨ నీతిమంతుణ్ణి యెహోవా దయతో చూస్తాడు. చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి ఆయన నేరస్తుడిగా ఎంచుతాడు.
౩ దుర్మార్గుల వలన అందరూ అల్లకల్లోలం అవుతారు. నీతిమంతుల పునాదులు స్థిరంగా ఉంటాయి.
౪ యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం వంటిది. భర్తకు సిగ్గు కలిగించే ఇల్లాలు అతని ఎముకలకు పట్టిన కుళ్లు.
౫ నీతిమంతులు చెప్పే ఆలోచనలు న్యాయసమ్మతం. దుర్మార్గుల సలహాలు మోసంతో కూడినవి.
౬ దుర్మార్గుల మాటలు హత్య చేయడానికి కాపు కాసి ఉన్న హంతకుల వంటివి. యథార్థపరుల మాట వల్ల వాళ్ళు విడుదల పొందుతారు.
౭ దుర్మార్గులు పాడైపోయి లోకంలో లేకుండా పోతారు. నీతిమంతుల నివాసం స్థిరంగా నిలుస్తుంది.
౮ ఒక్కొక్క మనిషి తన బుద్ధి కుశలతను బట్టి ఘనత పొందుతాడు. కపటవర్తనుడు తిరస్కారానికి గురౌతాడు.
౯ తినడానికి లేకపోయినా తన గురించి గొప్పలు చెప్పుకునేవాడి కంటే ఎదో ఒక చిన్న పని- సేవకుడుగా అయినా సరే- చేసుకుంటూ ఉండడం మంచిది.
౧౦ ఉత్తముడు తమ పశువుల ప్రాణాల పట్ల దయ చూపుతాడు. దుష్టులు చూపించే ప్రేమ క్రూరత్వమే.
౧౧ తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.
౧౨ దుర్మార్గులు చెడ్డవారికి దొరికిన దోపుడు సొమ్ము కోసం ఆశపడతారు. నీతిమంతుల ఉనికి వర్ధిల్లుతుంది.
౧౩ వ్యర్ధమైన మాటల వల్ల కలిగే దోషం ప్రాణాంతకమైన ఉరి వంటిది. నీతిమంతులు ఆపదలను తప్పించుకుంటారు.
౧౪ మనిషి తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో తృప్తి పొందుతాడు. ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళకు ఫలితం దక్కుతుంది.
౧౫ మూర్ఖుడు నడిచే మార్గం వాడి దృష్టికి సరియైనదిగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడు మంచి మాటలు ఆలకిస్తాడు.
౧౬ మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం వెల్లడి పరచక మౌనం వహిస్తాడు.
౧౭ సత్యం కోసం నిలబడేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. అబద్ద సాక్ష్యం పలికేవాడు కపటపు మాటలు పలుకుతాడు.
౧౮ కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి.
౧౯ నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.
౨౦ కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది.
౨౧ నీతిమంతులకు ఎలాంటి హానీ జరగదు. దుర్మార్గులను కష్టాలు వెంటాడుతుంటాయి.
౨౨ అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.
౨౩ వివేకం ఉన్నవాడు తన ప్రతిభను దాచిపెడతాడు. తెలివితక్కువ వాళ్ళు తమ మూర్ఖత్వాన్ని బయట పెడతారు.
౨౪ ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.
౨౫ విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.
౨౬ ఉత్తముడు తన పొరుగువాడు సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. దుర్మార్గుల దుష్ట ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.
౨౭ సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.
౨౮ నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు.