౧౫
౧ సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.
౨ జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.
౩ యెహోవా కళ్ళు లోకమంతా చూస్తూ ఉంటాయి. చెడ్డవాళ్ళని, మంచివాళ్ళని అవి చూస్తూ ఉంటాయి.
౪ మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.
౫ మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.
౬ నీతిమంతుల ఇల్లు గొప్ప ధనాగారం వంటిది. మూర్ఖునికి కలిగే సంపద బాధలపాలు చేస్తుంది.
౭ జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.
౮ భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం.
౯ దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు.
౧౦ సన్మార్గం విడిచిపెట్టిన వాడు తీవ్ర కష్టాలపాలౌతాడు. దిద్దుబాటును వ్యతిరేకించే వారు మరణిస్తారు.
౧౧ మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవాకు తేటగా కనబడుతున్నాయి. మనుషుల హృదయాలు ఆయనకు మరింత తేటగా కనబడతాయి గదా?
౧౨ అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు.
౧౩ ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
౧౪ తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.
౧౫ దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.
౧౬ విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.
౧౭ ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
౧౮ ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.
౧౯ సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.
౨౦ జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం కలిగిస్తాడు. మూర్ఖుడు తన తల్లిని తిరస్కరిస్తాడు.
౨౧ బుద్ధిలేని వాడు తన మూర్ఖత్వాన్ని బట్టి ఆనందం పొందుతాడు. వివేకవంతుడు ఋజుమార్గంలో నడుస్తాడు.
౨౨ సలహా చెప్పే వారు లేని చోట కార్యం వ్యర్థమైపోతుంది. ఎక్కువమంది సలహాలతో కొనసాగించే కార్యం స్థిరంగా ఉంటుంది.
౨౩ సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!
౨౪ వివేకం గల వాడు కింద ఉన్న మృత్యులోకంలో పడకుండా ఉండాలని పైకి వెళ్ళే జీవమార్గం వైపు చూస్తాడు.
౨౫ గర్విష్టుల ఇల్లు యెహోవా కూల్చి వేస్తాడు. విధవరాలి సరిహద్దును ఆయన స్థిరపరుస్తాడు.
౨౬ దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి.
౨౭ లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.
౨౮ నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.
౨౯ భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.
౩౦ కన్నుల్లో కాంతి చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు బలం కలిగిస్తాయి.
౩౧ జీవప్రదమైన బోధ అంగీకరించేవాడు జ్ఞానుల మధ్య నివసిస్తాడు.
౩౨ క్రమశిక్షణ అంగీకరించని వాడు తనను తాను ద్వేషించు కుంటున్నాడు. దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకం గలవాడు.
౩౩ యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.