౨౨
౧ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.
౨ ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే.
౩ బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు.
౪ యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి.
౫ ముళ్ళు, ఉచ్చులు మూర్ఖుల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా ఉంటాడు.
౬ పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.
౭ ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస.
౮ దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది.
౯ ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.
౧౦ తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి.
౧౧ శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు.
౧౨ జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాసఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు.
౧౩ సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.
౧౪ వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు.
౧౫ పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది.
౧౬ తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.
౧౭ శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.
౧౮ నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం.
౧౯ నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను?
౨౦ వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?
౨౧ నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?
౨౨ పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.
౨౩ యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు.
౨౪ కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.
౨౫ నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త.
౨౬ అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.
౨౭ ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?
౨౮ నీ పూర్వీకులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
౨౯ తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.