ప్రధాన సంగీతకారుని కోసం, తీగవాయిద్యాలతో. దావీదు కీర్తన.
౧ నా నీతిన్యాయాలకు ఆధారమైన దేవా, నేను విజ్ఞప్తి చేసినప్పుడు నాకు జవాబివ్వు. ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత ఇవ్వు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు.
౨ మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు?
సెలా.
౩ యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరచుకుంటాడని తెలుసుకోండి. నేను యెహోవాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు.
౪ భయంతో గడగడ వణకండి, కానీ పాపం చెయ్యకండి. మీరు పడకమీద ఉన్నప్పుడు మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని నింపాదిగా ఉండండి.
సెలా.
౫ నీతిసంబంధమైన బలులు అర్పించి యెహోవాలో నమ్మకం ఉంచండి.
౬ మాకు ఏదైనా క్షేమం కలిగించేది ఎవరు? అని అనేకమంది అంటారు. యెహోవా, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశించు.
౭ ధాన్యం, కొత్త ద్రాక్షారసం పుష్కలంగా ఉన్న వారి ఆనందం కన్నా అధికమైన ఆనందం నువ్వు నా హృదయానికి ఇచ్చావు.
౮ యెహోవా, శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం, భద్రత ఇస్తావు.