౧౪
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన.
౧ దేవుడు లేడు, అని బుద్ధిలేని వాడు తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన పాపం చేసిన వాళ్ళు. మంచి చేసేవాడు ఎవడూ లేడు.
౨ వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు.
౩ ప్రతిఒక్కడూ దారి తొలగిపోయాడు. వారంతా రోతగా ఉన్నారు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనా లేడు.
౪ యెహోవాకు ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేసేవాళ్ళందరికీ తెలివి లేదా?
౫ వాళ్ళు భయంతో వణికిపోతారు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుల సభతో ఉన్నాడు.
౬ యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు.
౭ సీయోనులోనుంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు గాక! యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబులో ఆనందం, ఇశ్రాయేలులో సంతోషం కలుగుతుంది.