౨౪
దావీదు కీర్తన.
౧ భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.
౨ ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.
౩ యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు నిలబడగలరు?
౪ అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.
౫ అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.
౬ ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే.
సెలా.
౭ మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.
౮ మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యాలు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.
౯ మహిమగల రాజు లోపలికి వచ్చేలా ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.
౧౦ మహిమగల ఈ రాజు ఎవరు? దూతల సైన్యాలకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు.
సెలా.