౬౦
ప్రధాన సంగీతకారుని కోసం. షూషన్ ఎదూత్ అనే రాగంతో పాడేది. దావీదు ఆరామ్ నహరాయీమ్ వారితో ఆరామ్ సోబాయీ వారితో యుద్ధం చేసినప్పుడు యోవాబు ఉప్పు లోయలో పన్నెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం)
౧ దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి.
౨ నీవు దేశాన్ని వణికించావు. దాన్ని ముక్కలుగా చేశావు. అది వణికిపోతున్నది. దానికి తగిలిన గాయాలు బాగు చెయ్యి.
౩ నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు. మేము తూలిపోయేలా చేసే మద్యాన్ని మాకు తాగించావు.
౪ సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి నీలో భయభక్తులు గలవారికి నీవొక ధ్వజాన్ని ఇచ్చావు.
౫ నువ్వు ప్రేమించే వారికి విమోచన కలిగేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబు చెప్పు.
౬ తన పరిశుద్ధత తోడని దేవుడు ప్రమాణం చేశాడు. నేను ఆనందిస్తాను! షెకెమును పంచిపెడతాను, సుక్కోతు లోయను కొలిపించి ఇస్తాను.
౭ గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం.
౮ మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియను బట్టి నేను సింహనాదం చేస్తాను.
౯ కోటగల బలమైన పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకుని వెళ్తాడు? ఎదోములోకి నన్ను ఎవడు నడిపిస్తాడు? అన్నాడు.
౧౦ దేవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు కదా? మా సేనలతో కలిసి బయలుదేరడం నువ్వు మానేశావు కదా?
౧౧ మనుషుల సహాయం ప్రయోజనం లేనిది. శత్రువులను జయించడానికి మాకు సహాయం చెయ్యి.
౧౨ దేవుని సహాయంతో మేము విజయం సాధిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.