౮౧
ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. ఆసాపు కీర్తన.
 
౧ మనకు బలం అయిన దేవునికి బిగ్గరగా పాడండి, యాకోబు దేవునికి ఉత్సాహంగా కేకలు వేయండి.
౨ పాట పాడి, కంజరి వాయించండి, మధురంగా తీగ వాయిద్యాలు వాయించండి.
౩ అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.
౪ అది ఇశ్రాయేలీయులకు చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ.
౫ ఆయన ఈజిప్టు దేశం మీదికి దండెత్తినప్పుడు యోసేపు సంతతికి దీన్ని శాసనంగా నియమించాడు. అక్కడ నేనెరగని భాష విన్నాను.
౬ వారి భుజాల నుంచి నేను బరువు దించాను, వారి చేతులు మోతగంపలు మోయకుండా విడుదల పొందాయి.
౭ నీ ఆపదలో నువ్వు మొరపెట్టావు. నేను నిన్ను విడిపించాను. ఉరిమే మబ్బుల్లోనుంచి నీకు జవాబిచ్చాను. మెరీబా నీళ్ళ దగ్గర నీకు పరీక్ష పెట్టాను.
సెలా.
౮ నా ప్రజలారా, వినండి. ఎందుకంటే నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. అయ్యో ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది!
౯ ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు.
౧౦ నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశంనుంచి మిమ్మల్ని తెచ్చింది నేనే. నీ నోరు బాగా తెరువు. నేను దాన్ని నింపుతాను.
౧౧ అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు.
౧౨ కాబట్టి వాళ్ళు తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయకాఠిన్యానికి నేను వారిని అప్పగించాను.
౧౩ అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది!
౧౪ అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను.
౧౫ యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక!
౧౬ అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.