౯౭
౧ యెహోవా పరిపాలిస్తున్నాడు. భూమి ఆనందిస్తుంది గాక. ద్వీపాలన్నీ సంతోషిస్తాయి గాక.
౨ మబ్బులూ చీకటీ ఆయనచుట్టూ ఉన్నాయి. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి పునాదిగా ఉన్నాయి.
౩ ఆయన ముందు అగ్ని బయలు దేరింది. చుట్టూ ఉన్న ఆయన శత్రువులను అది కాల్చివేస్తుంది.
౪ ఆయన మెరుపులు లోకాన్ని వెలిగిస్తాయి. భూమి దాన్ని చూసి వణికిపోతుంది.
౫ లోకనాథుడైన యెహోవా ఎదుట, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి.
౬ ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి రాజ్యాలన్నీ ఆయన మహాత్మ్యాన్ని చూస్తాయి.
౭ చెక్కిన ప్రతిమలను పూజించేవాళ్ళు, పనికిరాని విగ్రహాలను బట్టి గొప్పలు చెప్పుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. అలాటి దేవుళ్ళు అందరూ ఆయనకు మొక్కండి.
౮ యెహోవా, సీయోను ఇది విని సంతోషించింది. యూదా పట్టణాలు ఆనందించాయి. నీ నీతికరమైన ఆదేశాలనుబట్టి సంతోషిస్తున్నాయి.
౯ ఎందుకంటే యెహోవా, నువ్వు ప్రపంచమంతటికీ పైగా ఉన్న సర్వాతీతుడివి. దేవుళ్ళందరిలోకీ నువ్వు ఎంతో ఉన్నతంగా ఉన్నావు.
౧౦ యెహోవాను ప్రేమించే మీరంతా దుర్మార్గాన్ని అసహ్యించుకోండి! తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడతాడు, దుర్మార్గుల చేతిలోనుంచి ఆయన వారిని తప్పిస్తాడు.
౧౧ నీతిమంతులకు వెలుగును, నిజాయితీపరులకు ఆనందాన్ని విత్తనాలుగా చల్లడం జరిగింది.
౧౨ నీతిమంతులారా, యెహోవా మూలంగా ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతఙ్ఞతలు చెప్పండి.