౧౧౩
౧ యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.
౨ ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.
౩ సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.
౪ యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.
౫ ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?
౬ ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.
౭ ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.
౮ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం అయన ఇలా చేస్తాడు.
౯ ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.