౧౩౬
౧ యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨ ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౩ ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౪ గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగేది ఆయన ఒక్కడే. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౫ ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౬ ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౭ ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౮ పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౯ రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౦ ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౧ ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౨ ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౩ ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౪ ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౫ ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౬ ఎడారి మార్గం గుండా ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౭ గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౮ ఘనత వహించిన రాజులను ఆయన హతం చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౧౯ అమోరీయుల రాజైన సీహోనును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨౦ బాషాను రాజైన ఓగును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨౧ వాళ్ళ దేశాన్ని మనకు వారసత్వ సంపదగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨౨ తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సొత్తుగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨౩ మనం దీనావస్థలో పడిఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨౪ మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨౫ సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
౨౬ పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.