(3) అంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – క్రీస్తు మరణ పునరుత్థానాలతో ఐక్యత మూలంగా
౧ కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? ౨ అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం? ౩ క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడాా బాప్తిసం పొందామని మీకు తెలియదా?
౪ తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడాా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడాా సమాధి అయ్యాము. ౫ ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడాా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. ౬ ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. ౭ చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు.
౮ మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడాా జీవిస్తామని నమ్ముతున్నాము. ౯ చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. ౧౦ ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.
11 అంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – పాత జీవితం చనిపోయినట్టుగా ఎంచి కొత్త జీవితాన్ని దేవునికి లోబరచడం మూలంగా
౧౧ ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.
౧౨ కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. ౧౩ మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.
(3) ఆత్మ మూలంగా మరణం ద్వారా ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం ద్వారా (రోమా 8:2)
౧౪ మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు. ౧౫ అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. ౧౬ మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా? ౧౭ దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. ౧౮ తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.
౧౯ మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి. ౨౦ మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. ౨౧ అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం. ౨౨ అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం. ౨౩ ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.