౧ ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
(6) ఆత్మ నూతన నియమం విడుదల కలిగిస్తుంది, నిర్దోషిగా తీరుస్తుంది
౨ క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. ౩-౪ ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.
(7) శరీరంతో ఆత్మ ఘర్షణ (గలతీ 5:16-18)
౫ శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. ౬ శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. ౭ ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడాా. ౮ కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. ౯ దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు. ౧౦ క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది. ౧౧ చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.
౧౨ కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. ౧౩ మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.
నాలుగవ భాగం - సువార్త వలన కలిగే పరిపూర్ణమైన ఫలితం (1) విశ్వాసి కుమారునిగా, వారసునిగా అవుతాడు (గలతీ 4:4)
౧౪ దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. ౧౫ ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. ౧౬ మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. ౧౭ మనం పిల్లలమైతే వారసులం కూడాా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.
(2) బాధల నుండి, మరణం నుండి విడుదలైన సృష్టి దైవకుమారుల కోసం సిద్ధంగా ఉంది (అది 3:18, 19)
౧౮ మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. ౧౯ దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ౨౦ ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, ౨౧ నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. ౨౨ ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. ౨౩ అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. ౨౪ ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? ౨౫ మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
(3) విశ్వాసిలో నివాసముండే విజ్ఞాపన కర్త పరిశుద్ధాత్మ (హెబ్రీ 7:25)
౨౬ అలాగే పరిశుద్ధాత్మ కూడాా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. ౨౭ ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
(4) సువార్త మూలంగా దేవుడు ఉద్దేశించిన అమోఘమైన ఫలితాలు
౨౮ దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. ౨౯ ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. ౩౦ ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
౩౧ వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ౩౨ తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? ౩౩ దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. ౩౪ ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడాా ఆయనే.
(5) విశ్వాసి భద్రత
౩౫ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనల్ని వేరు చేస్తాయా? ౩౬ దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,
“నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.
వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”
౩౭ అయినా వీటన్నిటిలో మనల్ని ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. ౩౮-౩౯ నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు.