Home

రాజులు మొదటి గ్రంథము

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


-Reset+

చాప్టర్ 11

1 మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు... సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి
2 కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
3 అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.
4 ​సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృద యము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
5 సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.
6 ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.
7 ​సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.
8 ​తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
9 ​ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై
10 నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి
11 సెలవిచ్చినదేమనగానేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.
12 ​అయి నను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందునేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలోనుండి దాని తీసివేసెదను.
13 ​రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.
14 ​యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.
15 ​దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.
16 ​ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.
17 ​అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్న వాడై యుండెను.
18 ​వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.
19 ​హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లిచేసికొనిన రాణియైన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లిచేసెను.
20 ​ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను.
21 ​అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు వినినేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా
22 ​ఫరోనీవు నీ స్వదేశమునకు వెళ్ల కోరుటకు నాయొద్ద నీకేమి తక్కువైనది అని యడిగెను. అందుకు హదదుతక్కువైన దేదియు లేదు గాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను.
23 ​మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.
24 ​దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్య మునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.
25 ​​హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను.
26 మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.
27 ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను.
28 అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా ¸°వనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.
29 అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయు డును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.
30 అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెనుఈ పది తునకలను నీవు తీసికొనుము;
31 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగాజనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మో నీయుల దేవతకును మ్రొక్కి,
32 సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను.
33 అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీయుల గోత్ర ములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.
34 రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచ రించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినము లన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును.
35 అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;
36 నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
37 ​నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.
38 నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచి నట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్ప గించెదను.
39 వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదుసంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.
40 జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను.
41 సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
42 సొలొమోను యెరూష లేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.
43 ​అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.