Home

రాజులు మొదటి గ్రంథము

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


-Reset+

చాప్టర్ 6

1 అయితే ఇశ్రాయేలీయులు ఇగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సర మందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్‌ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను.
2 ​రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
3 ​పరిశుద్ధస్థలము ఎదుట నున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు,మందిరము ముందర అది పది మూరల వెడల్పు.
4 ​అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను.
5 మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మంది రపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను.
6 క్రింది అంతస్తుగది అయిదు మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది ఆరు మూరల వెడల్పు, మూడవ అంతస్తుగది యేడు మూరల వెడల్పు; ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండ మందిరపు గోడచుట్టు బయటి తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను.
7 అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.
8 మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్యమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను.
9 ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.
10 ​మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.
11 అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
12 ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;
13 నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.
14 ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
15 అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.
16 మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.
17 అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.
18 మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.
19 ​యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపర చెను.
20 గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననెపొదిగించెను.
21 ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగార ముతో దాని పొదిగించెను.
22 ​ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను.
23 ​మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;
24 ​ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.
25 ​రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.
26 ​ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.
27 ​అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.
28 ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.
29 మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కిం చెను.
30 మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను.
31 గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను.
32 ​రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను.
33 ​మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
34 ​రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
35 ​వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
36 ​మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూల ములతోను కట్టించెను.
37 ​నాలుగవ సంవత్సరము జీప్‌ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;
38 ​పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.